గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ కాస్త ఎడ్జ్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ తప్పదని వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తర్వాత గుజరాత్‌ను చేజిక్కించుకుందామని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కనీసం ప్రతిపక్షంలోనైనా కూర్చుందామని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి రెండెంకెల స్థానాలు రావడం కూడా కష్టమేనని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
గుజరాత్‌ను బీజేపీ మరోసారి నిలబెట్టుకుంటుండగా, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ – కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రెండు రాష్ట్రాల్లోను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం లేదా సీట్లు అంతంత మాత్రమేనని వెల్లడైంది. గుజరాత్లో కాంగ్రెస్‌ను దాటి, రెండో స్థానంలోకి వస్తామని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నెరవెరేలా లేదు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్లో బీజేపీకి 98 నుండి 150, కాంగ్రెస్ పార్టీకి 30 నుండి 71, ఆమ్ ఆద్మీ పార్టీకి 3 నుండి 14 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 24 నుండి 41, కాంగ్రెస్ పార్టీకి 20 నుండి 38, ఆమ్ ఆద్మీ పార్టీకి 0 నుండి 3 స్థానాలు రావొచ్చు.
ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ తానై ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర చేస్తూ, కాస్త తక్కువగా పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమని భావించి, రాహుల్ గాంధీ ప్రచారంలో ఎక్కువగా పాల్గొనలేదనే విమర్శలు బీజేపీ నుండి వచ్చాయి. 2024 లోకసభ ఎన్నికలకు సమాయత్తమయ్యే ఉద్దేశ్యంలో భాగంగా గుజరాత్ పైన ప్రత్యేక దృష్టి సారించాల్సింది పోయి, దాదాపు భారత్ జోడో యాత్రకే పరిమితమయ్యారని చెబుతున్నారు.
గుజరాత్లో గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 77 దక్కించుకుంది. బీజేపీ ఇప్పుడు గతంలో కంటే అధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో క్రితంసారి బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు దక్కించుకుంది. ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తూ, అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.